చరిత్ర సృష్టించిన నమీబియా: అంతర్జాతీయ టీ20 థ్రిల్లర్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం


నమీబియా క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: దక్షిణ ఆఫ్రికాతో జరిగిన ఏకైక టీ20 మ్యాచులో నమీబియా ప్రోటీస్‌ను ఓడించింది. విండ్‌హోక్, అక్టోబర్ 12, 2025: నమీబియా క్రికెట్ గ్రౌండ్‌ (NCG)లో జరిగిన ఏకైక T20I మ్యాచ్‌లో నమీబియా దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయం సాధించింది. 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన నమీబియా, 4,000 మంది ప్రేక్షకుల సమక్షంలో చరిత్ర సృష్టించింది. 2027 ODI వరల్డ్ కప్ కోసం నిర్మించిన ఈ అత్యాధునిక స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్, నమీబియా మరియు దక్షిణాఫ్రికా మధ్య తొలి ఎన్‌కౌంటర్‌గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, కెప్టెన్ డొనోవన్ ఫెరైరా నేతృత్వంలో 20 ఓవర్లలో 134-8 స్కోరు చేసింది. దక్షిణ ఆఫ్రికా స్టార్ ఆటగాడైన క్వింటన్ డి కాక్ తొలి ఓవర్‌లోనే డకౌట్ కాగా, జాసన్ స్మిత్ (31) ఒంటరి పోరాటం చేశాడు. నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్‌మన్ 3-28, హీంగో 2-32 తో రాణించి, ప్రోటీస్‌ను కట్టడి చేశారు. ఛేజింగ్‌లో నమీబియా 42-3 వద్ద తడబడినప్పటికీ, జేన్ గ్రీన్ (30*) చివరివరకు నిలిచి విజయానికి మార్గం సుగమం చేశాడు. గెర్హార్డ్ ఎరాస్మస్ (25), జాన్ ఫ్రైలిన్క్ (22) కీలక భాగస్వామ్యాలు అందించగా, చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం ఉండగా.. చివరి బంతికి ఫోర్ కొట్టి విజయాన్ని కైవసం చేసుకుంది టీం నమీబియా.

బాణసంచా కాంతుల మధ్య ఆటగాళ్లు విజయోత్సవ ప్రదర్శన చేశారు.ఈ విజయం జింబాబ్వే, ఐర్లాండ్ మరియు శ్రీలంక తర్వాత పూర్తి సభ్య దేశంపై నమీబియా సాధించిన నాల్గవ విజయంగా నిలిచింది. ICC ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న నమీబియా, 2026 టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధమవుతూ, ఈ గెలుపుతో ఆఫ్రికన్ క్రికెట్‌లో కొత్త శకాన్ని రగిలించింది. దక్షిణాఫ్రికాకు ఈ ఓటమి, పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ ముందు ఒక గుర్తింపుగా మిగిలింది. ఈ విజయం అసోసియేట్ క్రికెట్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.

Post a Comment

Previous Post Next Post